హిందువులు ఏకాదశితిథికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి ఏకాదశికి విశిష్టత ఉంటుంది. ఫాల్గుణమాసం.. శుక్షపక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది (2026) అలాంటి పవిత్రమైన రోజు ఫిబ్రవరి 27న వచ్చింది. ఆ రోజున లక్ష్మీనారాయణులను సేవించి.. ఉసిరి చెట్టుకు పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆరోగ్యం.. సంపదతో పాటు మోక్షం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఫాల్గుణమాసం శుక్లపక్షం ఏకాదశి రోజు శ్రీహరి విష్ణువు పూజా ఆరాధనకు అంకితం చేయబడింది. ఆ రోజు ఉసిరి చెట్టు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని వల్ల జీవితంలో సుఖ సమృద్ధులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
ఎప్పుడు పూజ చేయాలి..
- అమలకి ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 26 అర్దరాత్రి 12.33 గంటలకు
- అమలకి ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 27 రాత్రి 10.32 గంటలకు
- సూర్యోదయ సమయానికి ఉన్న తిథి ప్రకారం ఈసారి ఫిబ్రవరి 27 శుక్రవారం అమలకి ఏకాదశిగా పరిగణిస్తారు.
అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ చెట్టును నారాయణుడి స్వరూపంగా భావించి పూజిస్తే కష్టాలు తొలగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఉసిరి చెట్టును దర్శించడం వల్ల పాపాలు తగ్గుతాయని, దానిని తాకడం ద్వారా గ్రహబాధలు తగ్గుతాయని నమ్మకం ఉంది. ఈ రోజు ఉసిరి చెట్టును భక్తితో ఆరాధించిన వారికి పాప విమోచనం కలిగి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు.
ఉసిరి కాయలను దానం..
అమలకి ఏకాదశి రోజు (ఫిబ్రవరి 27) ఉసిరి కాయలను దానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని విశ్వసిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఆయురారోగ్యాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. సంపద, దీర్ఘాయుష్షు, మానసిక ప్రశాంతత కలుగుతాయని కూడా చెబుతారు. ఉసిరి చెట్టు పూజ వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భావిస్తారు.
పూజా విధానంలో భాగంగా ఈ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటి పూజా గదిని శుభ్రపరచి ముగ్గు వేసి విష్ణువు చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇంటి వద్ద ఉసిరి చెట్టు లేదా మొక్క ఉంటే దాని కిందనే విష్ణువు పటాన్ని ఉంచి పూజ చేయవచ్చు. వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు సంకల్పం చేసి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించాలి.
తులసి దళాలు…
ఏకాదశి పూజలో తులసి దళాలు ముఖ్యమైనవి. పూలు, అక్షతలు, కుంకుమతో లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఉసిరి కాయలపై దీపాలు వెలిగించడం ప్రత్యేకతగా చెప్పబడుతుంది. దేవుడికి నైవేద్యంగా కూడా ఉసిరి కాయలు సమర్పిస్తారు.ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం శ్రేయస్కరంగా భావిస్తారు. అష్టోత్తర శతనామావళి, శ్లోకాల పఠనం, దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ పూర్తి చేయాలి.
అమలకి ఏకాదశి రోజున విష్టుసంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజున విష్ణుమూర్తి.. శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల కష్టాలు తీరి... కోరికలు నెరవేరుతాయని, సంసార సుఖంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ తిథిని ఆమలకి ఏకాదశి అని కూడా అంటారు.
ఏకాదశి రోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేయడం శ్రేయస్కరం అని సూచిస్తారు. జాగరణ సమయంలో విష్ణు కథలు వినడం, అష్టాక్షరి మంత్రం జపించడం, భజనలు చేయడం మంచిదిగా చెబుతారు. బ్రహ్మచర్యం పాటించడం కూడా ముఖ్యంగా చెబుతారు. ఉపవాసం చేయలేని వారు సాత్వికాహారం మాత్రమే తీసుకుని భక్తితో పూజలు చేయాలి. ఇతరులను దూషించడం, వాదనలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తారు.
అమలకి ఏకాదశి లక్ష్మీ నారాయణులకు అంకితం చేయడమైనది. ఆరోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టు సాక్ళాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పపుపు.. కుంకుమ.. గంధం సమర్పించాలి. తరువాత ధూప ..దీప.. నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి, ఇలా చేయడం వలన ధనం.. సంపద కలుగుతాయి. అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి.
ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఉసిరి చెట్టు కింద కూర్చుని ..ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః.. మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధన ధాన్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. .
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
